Home Top Ad

Responsive Ads Here

Is Marraige is compulsary to all Women and Men? స్త్రీ పురుషులకు వివాహం తప్పనిసరా?


స్త్రీ పురుషులకు వివాహం తప్పనిసరా?మనిషికి వివాహం అనేది ఒక సాంఘిక సదాచారం.

జీవనావశ్యకమైన కేశఖండనము, చౌలము ఉపనయనము, విద్యాభ్యాసము మొదలైన మానవ సంస్కారాలన్నిటిలో వివాహ సంస్కారం ప్రధానమైంది.

సంస్కారం అంటే మనిషిలో వున్న ప్రజ్ఞనూ శక్తినీ హెచ్చరించి నిద్రలేపి సమాజాభివృద్ధికీ ప్రజాపురోగతికీ నడిపించటం. వివాహంవల్ల దేవఋణం - పితృఋణం - ఋషిఋణం ఈ రుణత్రయం నుండి పురుషునికి విముక్తి దొరుకుతుందని శాస్త్రం చెబుతుంది.

దైవఋణం అంటే?
గాలి, నీరు, ఆహారం, అగ్ని, పగలు, రాత్రి, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఓషధులు, వృక్షాలు మొదలైన ప్రకృతి ప్రసాదించిన సమస్త సౌలభ్యాలకు ప్రతిగా తన ఋణాన్ని తీర్చుకోవటం, కృతజ్ఞతా భావనతో ప్రకృతిసంపదను కాపాడటం 'దైవఋణం'.

పితృఋణం అంటే?

తనకు జన్మనిచ్చి, తనలో రక్తమాంసాదుల నింపి, మల మూత్రాదులను కడిగి, వైద్యసేవలు చేసి, అన్నపానీయాదుల్ని సమకూర్చి పెట్టి, పెద్దజేసి మాటనేర్పి, విద్యాబుద్ధుల్ని నేర్పించి ప్రయోజకునిగా చేసి, గృహక్షేత్ర ధనాదుల నిచ్చిన తల్లిదండ్రులను వార్డ్యక్య జీవితంలో సేవించి కాపాడటం “పితృఋణం".

ఋషిఋణం అంటే?

ఈ సృష్టిలోని సకలసౌకర్యాలను మనం మాత్రమే కనిపెట్టలేదు.మనకంటే ముందుగా జన్మించిన పరోపకారబుద్ధులైన మహర్షులెందరో ఎంతోకాలం శ్రమించి, గణిత, ఖగోళ విజ్ఞానాన్ని మనకు అందించారు. మనం తినే ఉప్పు చింతపండు దగ్గరనుండి శరీరానికి శక్తిని అందించే కూరగాయల వరకు వారి దయాభిక్షే! ఆయుర్వేద వైద్యం నుండి పసుపు వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వరకూ వాటి పోషక విలువల్ని తెలుసుకొని మనకు అందించింది ఋషులే. కాబట్టి సనాతనులైన వారందరి ఋణాన్నీ విద్యార్జన చేయటం ద్వారా వారు రచించిన గ్రంథాలను చదివి గ్రహించి సమస్త ప్రజలకు తెలుపటం ద్వారా ఋషిరుణాన్ని తీర్చుకోవాలి. ఇదే “ఋషి ఋణం".

ఈ ఋణత్రయం తీర్చుకోవటానికి వివాహం తప్పనిసరిగదా! ఎందుకంటే ఒంటరిగా ఒక్కడే అన్ని పనులను చేయలేడు. తోడు కావాలి. ఆ తోడు ఆత్మీయతతో కూడి వుండాలి. ఆ ఆత్మీయతకు శాశ్వతత్వం కావాలి. అందుకే పురుషునికి భార్య అవసరం ఎంతో, ఉంది అలాగే భార్యకి కూడా అంతే అవసరం వుంది. వివాహానికి కూడా అంతే ప్రాధాన్యత వుంది.

మనిషికి నాగరికత వివేకం లేని రోజుల్లో స్త్ర పురుషుల మధ్య వివాహాలు లేవు. పశువుల్లా యధేచ్ఛగా వుండేవారు. పిల్లలను కనటం పోషించటం ఆడవారి వంతు అయ్యేది. అంతేకాక స్త్రీని అనుభవించటంకోసం పురుషులు తమలో తాము కొట్లాటలకు దిగేవారు. బలహీనులైనవారు ఈ పోట్లాటలో మరణిస్తుండే వారు. బలం కలవాడు బలహీనులతో యుద్ధంచేసి చాలామంది స్క్రీలను తానొక్కడే అనుభవిస్తుండేవాడు.స్త్రీల పోషణాభారం కానీ, పిల్లల పెంపకంగానీ పురుషునికి సంబంధం వుండేదికాదు. స్త్రీలకు రక్షణ అనేది ఏ మాత్రమూ ఉండేది కాదు.

ఇది త్రేతాయుగ విషయం

సరిగ్గా ఈ సమయంలో జ్ఞానవంతులైన సనాతనులు. ఋషులు ఆరోగ్యవంతమైన సలక్షణమైన ప్రజోత్పత్తికి స్త్రీ రక్షణ ముఖ్యమని గుర్తించారు. విశృంఖల కాముకత్వాన్ని నిషేధించారు. ఒక స్త్రీకి ఒక పురుషుడు ఒక పురుషునికి ఒక స్త్రీనీ వుండాలని చెబుతూ స్త్రీల రక్షణకోసమే పాతివ్రత్య ధర్మాన్ని ప్రవేశపెట్టారు. స్త్రీలను ఈ పాతివ్రత్య థర్మంతో కట్టడి చేయగలిగారేగాని పురుషులను మాత్రం నిర్భంధించలేకపోయారు. స్త్రీలు ఋతు సమయంలో వున్నపుడు గర్భవతులుగా వున్నపుడు పురుషులు పరస్త్రీ వ్యామోహానికి పాల్పడటం జరుగుతుండేది.స్త్రీలకు మాత్రం ఒకే భర్త. పురుషులకు అనేకమంది భార్యలు వుండేవారు.

సద్ధర్మపరులైన ఆర్య ఋషులకు పురుషాధిక్యం మింగలేని మెతుకులా అయింది. పురుషులందరినీ కట్టడి చేయాలని ఆలోచించి “వివాహం" అనే ధర్మకార్యాన్ని ప్రవేశ పెట్టారు. కాని క్షత్రియుల శక్తి శౌర్యాలకు భయపడ్డారేమో, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర వర్ణాలవారికి ఏకపత్నీ వ్రతాన్ని సంధానించారు. క్షత్రియులకు ఈ ధర్మంలో స్వతంత్రత నిచ్చారు.

ఈ సమయంలో ఏకపత్నీ ప్రతాన్ని పాలించినవాడు శ్రీరాముడు.

అవకాశంవున్నా, అవసరం వున్నా, ఆవశ్యకతవున్నా శ్రీరాముడు ఏకపత్నీ వ్రతాన్ని దాటి చరించలేదు. శ్రీరాముని తండ్రియైన దశరథునికి మూడువందల మంది భార్యలు ముగ్గురు రాణులు వున్నారని తెలుస్తోంది. అయినా శ్రీరాముడు ఏకపత్నీ వ్రతాన్ని పాలించాడు. అందుకే ఆయన ఆర్యులకు ఆరాధ్య దైవమయ్యాడు.

(ఈనాటి ఆడవారికి శ్రీరాముడు సీతను పరిత్యజించాడన్న ఒక్కవిషయం మాత్రమే తెలుసుగాని, అంతటి వియోగంలోనూ శ్రీరాముడు పరస్త్రీ పరిగ్రహణం చేయని సుగుణ వంతుడని తెలియక పోవటం విచారకరం).

స్త్రీ పురుషులకు వివాహం అనేది ఒక అభయం! ఒక రక్షణ! ఒక మర్యాద! ఒక గౌరవం! ఒక సుసాంప్రదాయం! నవీన నాగరికతలో వివాహం లేకుండానే కేవలం కామసుభాలకోసం, ధనతాపత్రయం కోసం జీవిస్తున్నవారు పట్టణాల్లో కోకొల్లలున్నారు. ఇది తప్పు! అనాగరికం! అధర్మం! అసంస్కృతి! అమర్యాద! అరాచకం!

ఏ మతంవారైనా, ఏ కులంవారైనా, ఏ ధర్మంవారైనా ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి. ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలి. ఏ మతమైనా ఏ ధర్మమైనా చెడుమార్గాన్ని బోధించదు. పాశ్చాత్యులు విశృంఖల శృంగార అనుభవిస్తారను కోవటం అవివేకం. వారికి కూడా సమాజనియమాలు కట్టుబాట్లు వున్నాయి. అయితే ఆర్య మతానికీ పాశ్చాత్య మతానికీ ఒక వ్యత్యాసం వుంది. భారతీయులుగా పుట్టినవారు ఏ కులంవారైనా సంఘ నియమాలకు భయ పడతారు. పాశ్చాత్యులు "లా అండ్ ఆర్డర్"ని ఉప యోగించుకొని లాభపడతారు.

ఆర్యులు ధర్మానికి భయపడతారు

మన ఆర్యస్త్రీలకు చట్టాలు తెలుసు. విడిపోయి వెళ్ళిపోవటం తెలుసు వెళ్ళి బ్రతకగల దారులు తెలుసు. కాని భర్తలను విడచి వెళ్ళరు! ఎంతటి అసమర్థుడైనా, ఎంతటి నికృష్టుడైనా, ఎంతటి పాశ వికుడైనా కట్టుకొన్న వాడితో జీవితం సాగిపోవాలని కోరుకొంటారు.

ఆర్యవనితా ! నీకు పాదాభివందనం!
సహనమూర్తి ! నీకు సహస్రాభివందనం!!

ప్రపంచంలో ఆర్యస్త్రీలవంటి స్త్రీలు వుండరు. ఆర్యమతంవంటి మత వుండదు. ఆర్య సంప్రదాయంవంటి సంప్రదాయం వుండదు. ఆర్యులకు కన్నబిడ్డలు ప్రాణంతో సమానం. ఈ బిడ్డ పోతే మరొక బిడ్డను కనవచ్చు అని అనుకోరు. కన్నబిడ్డలకోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడతారు. ఈ దేశంలో బంధాలమధ్య చట్టాలకు విలువ లేదు. ఇక్కడ బంధమే గొప్పది. చట్టం గొప్పదిగాదు.

మనమిపుడు ధనానికి దాసోహమవుతున్నాం. ఎలా సంపాదించావన్న ముఖ్యం కాదు. ఎంత సంపాదించావన్నది మాత్రం ముఖ్యం. మన సంస్కతినీ మన భాషనీ, మన వున్నతినీ, మన సంప్రదాయాన్నీ, మన ధార్మికతాను మరచిపోయి విశృంఖలత్వానికి పరవ్యామోహానికీ మనం బానిసభావం వహించటం భరతమాత దురదృష్టం.

వివాహ పద్దతి ప్రారంభమై ఎనిమిదివేల సంవత్సరాలయింది.

స్త్రీ పురుషులిద్దరినీ బంధించి బ్రతికించేది వివాహమే, వివాహ సంస్కారంలో వరుడు అగ్నికి నమస్కరించి వధువును చేతిని పట్టుకొంటూ

ఓ గృహపత్నీ! న ఇంటికి యజమానురాలివై పెత్తనం వహించి గృహమును తీర్చిదిద్దుకొనుటకై దేవతయగు పూషాదేవి నా యింటికి నిన్ను తోడ్కొని వచ్చుగాక! అశ్వినీ దేవతలు రథముపై నిన్ను నా వద్దకు చేర్చుడురు.

" ధృవంతే రాజా వరుణో
ధృవం తేనో బృహస్పతి
ధృవంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రంధారయతాంధ్రువమ్" -
అంటూ వేదమంత్రవూర్వకంగా పురోహితుడు వధూవరులిద్దరికీ బ్రహ్మముడి వేస్తాడు. ఓ నవదంపతులారా! క్రొత్తగా దాంపత్య సామ్రాజ్యము వహించబోవు మీకు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, బృహస్పతి దేవతలు శాశ్వతత్వము చేయుదురు గాక అని అర్ధం.

కన్యాదాన సమయంలో వరుడు కన్యను స్వీకరిస్తూ శ్రీపరమేశ్వరుని ప్రీతికోసం ధర్మబద్ధ
సంతాన సంపదకోసం ఈ కన్యను వివాహం చేసికొను చున్నాను' అని పెద్దలందరి సమక్షంలో చెబుతాడు.

పెండ్లికుమారుని దైవస్వరూపునిగా భావించి కాళ్ళుకడగటం, పూజించటం కన్యాదానం చేసి ఉత్తమ సంతానాన్ని కనమనీ, నూరు సంవత్సరాలు సుఖంగా అన్యోన్యంగా జీవించమని ఆశీర్వరించే “మామగారు' హిందువులకే స్వంతం.  హిందూ వివాహపద్దతిని గౌరవించే యువకులకే స్వంతం.

చివరిగా ఒక్కమాట
'లవ్ మార్యరేజ్' తప్పుగాదు. కానీ కన్నవారి ఆశీస్సులతో వైదిక పద్ధతిలో మాత్రమే వివాహం చేసుకోవాలి. పెద్దల అనుమతితో చేసుకొనే వివాహమే స్థిరంగా వుంటుంది. జీవితానికి హాయిని ఇస్తుంది. గౌరవప్రదంగా వుంటుంది. మిమ్ములను కని పెంచి పోషించి పెద్దవారినిగా చేసిన తల్లిదండ్రులకు సంతోషాన్ని కల్గిస్తుంది. అంతేకాదు సుమా! మీ బిడ్డలకు రక్షణ, మీకు అభివృద్ధి కలుగుతుంది.
!!!శతమానం భవతి!!!

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి. 

No comments