Home Top Ad

Responsive Ads Here

Is Idol Worship a orthodox? విగ్రహారాధన సనాతనమా?


 విగ్రహారాధన సనాతనమా? 


లక్షలాది సంవత్సరాల క్రిందట, మానవుడు పశుప్రాయుడై వున్న దశలో, పచ్చిమాంసాన్ని, పచ్చిదుంపలను, తింటూ జీవిస్తున్నస్థితిలో అగ్నిపుట్టటం చూచాడు. సమస్తాన్నీ హరించివేయటం చూచాడు. భయపడిపోయాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు. అగ్ని ప్రతాపానికి బెదిరిపోయి పరుగులు తీశాడు. పంచభూతాలైన భూమి, నీరు, వాయువు, అగ్ని - ఆకాశం ఈ ఐదింటిలో 'అగ్ని' తప్ప మిగిలిన నాలుగు సహజంగానే కోరుకోకుండానే, కష్టపడకుండానే లభిస్తాయి. ఆదిమానవునికి ఈ నాలుగు మాత్రమే తెలుసు. అగ్నిని చూచిన తరువాత దానినే దేవునిగా ఆరాధించటం జరిగింది.
మనకు ఆదిదేవుడు అగ్నిదేవుడే!

అందుకే మన చతుర్వేదాలలో మొదటిదైన ఋగ్వేదం “అగ్నిమీళే పురోహితం యజ్ఞస్యదేవమృత్విజమ్ | హోతారం రత్నథాతమమ్||" అంటూ ప్రారంభం జరుగుతుంది. అందుకే హోమాలు చేసి అగ్నిని పూజించేవారు. అగ్నిని పుట్టించే 'అగ్గిపెట్టెలు' ఆనాడు లేవుగదా! మూడు నాలుగు వందల సంవత్సరాలక్రితం కూడా మనకు 'నిప్పు పెట్టె' తెలియదు. చెకుముకి రాళ్ళతో నిప్పు పుట్టించటమే తెలుసు.

కేవలం పదిహేను వందల సంవత్సరాలనుండే మనకు విగ్రహారాధన  ప్రారంభం అయిందనవచ్చు. దేవునికి రూపంలేదు! పేరులేదు! రంగులేదు! దేవాలయ నిర్మాణం కూడా విగ్రహారాధన తరువాతనే జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం కూడ.

విగ్రహారాధన సనాతనం కాదు
ఆధునికం మాత్రమే!

విద్యాపీఠాలు, శక్తిపీఠాలు మాత్రం వేలాది సంవత్సరాలనుండీ వున్నాయి. మొట్టమొదటి మనకంటికి కనిపించే దేవుడు అగ్నిదేవుడుగా గుర్తించిన తరువాత సృష్టిసంకేతమైన శివలింగం మనకు ఆరాధ్యమైంది. త్రేతాయుగంనాడే మనకు శివలింగాలు వున్నట్లుగా చరిత్రాధారాలు వున్నాయి. శివభక్తుడైన రావణ బ్రహ్మ శివలింగపూజ చేసేవాడు. శ్రీరాముడు కూడా లింగప్రతిష్ఠ చేసినట్లుగా రామాయణంలో వుంది. అయితే దేవుడిని బొమ్మగా చేసి నాలుగు, ఆరు, పదిచేతులు పెట్టి, బంగారు ఆభరణాలు తొడిగి, గుడిలోపల పెట్టి, తాళాలు వేసి, తలుపులు మూసే పద్దతి క్రీస్తుశకం నుండే మొదలయింది. ఈ విగ్రహారాధనకు బ్రాహ్మణాచార్యుల మద్దతు కూడా వుండటంతో పామర ప్రజానీకం అనుసరించింది. పదిహేను వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ విగ్రహారాధనను పందొమ్మిదవ శతాబ్దంలో కొందరు వ్యతిరేకించారు.

ఇప్పటికి మూడువేల సంవత్సరాలనాటి కాలాన్ని వేదయుగం అని చెబుతారు. యాగాలు హోమాలు చేస్తూ అగ్నిదేవుని పూజించేవారు. గౌతమ బుద్ధుడు ఈ యాగాలను నిరసించాడు.

కష్టించి పండించిన ఆహార ధాన్యాలను నిప్పులో వేసి (హోమాలలోవేసి) బూడిద చేయటాన్నీ, దేవునికి జంతువులను బలి ఇవ్వటాన్ని కూడా బౌద్ధ మతస్థులెవరూ అంగీకరించలేదు. బౌద్ధమతం ఆనాటి భారతదేశంలో చాలా బలంగా వుండేది. బౌద్ధం అందరినీ ఆకర్షించింది.

యాగాలు హోమాలు క్రమంగా నిలిచిపోయాయి. తరువాత విగ్రహారాధన ప్రారంభం అయింది.

విగ్రహారాధన లేకుంటి శైవ, వైష్ణవ మతాలు ఈనాటికి క్షీణించివుండేవి! విగ్రహారాధనకోసం దేవాలయాల నిర్మాణం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. క్రొత్త క్రొత్త పురాణాలు, కథలు పుట్టుకొచ్చాయి.

రకరకాల దేవుళ్ళు, రకరకాల దేవాలయాలు పుట్టుకొచ్చి ఒకరకంగా హిందువుల ఐక్యతనూ హిందూత్వాన్ని బలహీనం చేసాయి. హిందూదేశం “ఇండియా'గా మారిపోయింది. పరాయి మతాలు హిందూదేశానికి వచ్చి బలపడ్డాయి. హిందూమతం అంటే ఏమిటో, హిందూమతం గొప్పదనమేమిటో, సరిగా వివరించేవారు లేరు. ఇంకా కొత్త కొత్త దేవుళ్ళు పుడుతూనే వున్నారు. తినే తిండిలోనూ, ధరించే బట్టలోనూ, మాటాడే భాషలోను ఆచార వ్యవహారాలలోనూ మాత్రమే కొత్తదనం కాదు, పూజించే దేవుళ్ళులోనూ కొత్తదనం కోరుతున్నారు నేటి జనం.

విగ్రహారాధన మొదలైన తరువాతనే దేవుళ్ళలో గొప్ప దేవుళ్ళు, మామూలు దేవుళ్ళు మొదలయ్యారు. డబ్బులతో దైవ దర్శనాలు జరుగుతున్నాయి. శ్రీమంతులకే  అగ్ర స్థానం లభించటం జరుగుతోంది. కానుకలు తప్పనిసరి అయ్యాయి. ఇందుకు సంతోషించాలో, విచారించాలో అర్థం కావటంలేదు. 
దేవాలయాలు అంటే ఎవరైనా, ఏ సమయంలోనైనా, నేరుగా దేవుని దర్శించుకునే విధంగా ఉండాలి. డబ్బులిచ్చి టికెట్లుకొని దర్శించుకునే చెడ్డవిధానం మారాలి. మన మతాన్ని మన సంప్రదాయాన్ని ఇతరులు ఎగతాళి చేస్తుంటే భరించ గలమా.

హిందూమతానికి ఎంతటి దరిద్రం పట్టింది !
దేవుడా! రక్షించు హిందూమతాన్ని !

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.

1 comment: