Home Top Ad

Responsive Ads Here

What are wedding vows'? పెళ్ళినాటి ప్రమాణాలు' అంటే ఏమిటి?

పెళ్ళినాటి ప్రమాణాలు అంటే ఏమిటి?


వివాహ విషయంలో హిందూధర్మంలో ఒక ప్రత్యేకత వుంది. కేవలం శారీరక సుఖాలకోసం, లైంగిక ఆనందంకోసం వివాహం చేసికొనటాన్ని హిందూధర్మం అంగీకరించదు. వివాహం అనేది జీవన సంస్కారంగా భావిస్తారు హిందువులు. సృష్టి కార్యం కోసం జరిగే పవిత్రకర్మగా కూడా భావిస్తారు.

అందుకే వధూవరులు ఇద్దరూ వివాహ సమయంలో ప్రమాణాలు చేస్తారు.

"ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి" అని వరుడు ప్రమాణం చేస్తాడు. అంటే 'ధర్మమునందుగానీ, సంపదల విషయమునందుగానీ, శారీరిక సుఖవిషయము లందుగానీ, దానధర్మములవల్ల లభించు మోక్షవిషయములందు గానీ నిన్ను విడచి నడువను.' అని వధువును పరిగ్రహించేముందు వరునిచేత ప్రమాణం చేయిస్తారు.

తరువాత మాంగల్యధారణ సమయంలో కూడ ప్రమాణంలాంటి మంత్రాన్నే ఈ విధంగా చెబుతాడు వరుడు. "మాంగల్య తంతునానేన మమజీవన హేతునా కంఠే బధ్నామిసుభగే త్వం జీవ శరదశ్శతం" అనే మంత్రానికి అర్థం ఏమిటంటే “ఓ మాంగల్యమా! నా జీవనానికి కారణభూతురాలైన ఈ సౌభాగ్యవతి కంఠానికి నిన్ను అలంకరిస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు ఈమె కంఠము నందే వుందువుగాక” అని చెప్పి మాంగల్యాన్ని వధువు మెడలో మూడుముళ్ళు వేసి కడతాడు. ఈ మూడే ముళ్ళు ఎందుకు వేయిస్తారంటే త్రిమాతలైన లక్ష్మి పార్వతీ, సరస్వతీ దేవతలకు అంకితంగా నన్నమాట!

సప్తపదిలో కూడా "ఏకం ఇషే విష్ణుత్వాం అన్వేతు" అనే మంత్రాలతో ఏడడుగులు వేయిస్తారు. మొదటి అడుగు శక్తికోసం-రెండవ అడుగు బలం కోసం-మూడవ అడుగు వ్రతం కోసం - నాల్గవ అడుగు ఆనందం కోసం, ఐదవ అడుగు ఇంద్రియబలం కోసం-ఆరవ అడుగు రుతువుల కోసం, ఏడవ అడుగు గృహధర్మాలకోసం. ఇద్దరూ కలిసి జీవితాంతం ఇలాగే కలిసి నడుస్తామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తూ నడుస్తారు. ఈ సప్తపదితో వధువు యింటి పేరు మారిపోతుంది. వివాహానికి ఈ కార్యక్రమమే ముఖ్యమైనది.

(ఇపుడు చాలామంది 'సప్తపది' కార్యక్రమం జరిపించుటలేదు.)

ఈ పెళ్ళినాటి ప్రమాణాలను పురుషుడు తప్పకుండా అనుసరించి పాటించిననాడే పవిత్రమైన వివాహం పరమార్ధస్థితిని చేరుకొంటుంది. భార్యకు భర్త భర్తకు భార్య తోడునీడగా, అన్యోన్యంగా అరమరికలు లేకుండా అర్థనారీశ్వర తత్వంతో బ్రతికినప్పుడే ఈ ప్రమాణాలకు ఒక విలువ వుంటుంది.

కీచులాటలతో, వివాదాలతో, నిత్యసమస్యలతో, నిండు జీవితాలను బండల పాలు చేసుకొనే వారికి ఈ ప్రమాణాల విలువ తెలియదు. వివాహ ప్రయోజనం అర్థంకాదు.

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.

No comments